పశ్చిమకు సేవకుడిని…మీలో ఒకడిని….గెలిపించండి…మీ కోసమే పని చేస్తా మాటా మంతి కార్యక్రమంలో ప్రజలకు సుజనా చౌదరి హామీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ మౌలిక వసతుల ప్రాధాన్యమే ద్యేయంగా పని చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోకవర్గ అభివృద్ధి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో మాటా మంతీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ లోక్ సభ అభ్యర్థి కేశినేని శివనాథ్ పాల్గొని నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించారు. ప్రజా సేవకుడిగా, ప్రజలలో ఒకడిగా ఉంటూ.. మీ కోసమే పనిచేస్తానని, ప్రజలకు తోడుగా, అండగా ఉంటానని సుజనా చౌదరి అన్నారు.
పురోగమనం దిశగా అడుగులు వేస్తూ . ప్రజలకు నిత్యం సామాజిక పరంగా చేయూతను ఇస్తానన్నారు. పశ్చిమ అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై సలహాలు సూచనలు తీసుకున్నారు. మీ ప్రేమ, అభిమానం కోసమే మీ వద్దకు వచ్చానంటూ ప్రజలను ఉద్దేశించి సుజనా అన్నారు. ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలైనా, ఏ కష్టం వచ్చినా.. ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టైటిల్ యాక్ట్ గురించి సుజనా దృష్టికి పలువురు తీసుకొచ్చారు. భూమి యజమానుల హక్కులను హరించే టైటిల్ యాక్ట్ ను అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు. నియోజకవర్గంలో హజ్ హౌస్ నిర్మించాలని అన్సారీ అనే వ్యక్తి అడగగా కూటమి అధికారంలోకి రాగానే షాదీ ఖానా అభివృద్ధి పరిచి హజ్ హౌస్ నిర్మాణం చేపడతామన్నారు. టీడీపీ హయాంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హజ్ హౌస్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రోడ్లు డ్రైన్లు తాగునీటి సమస్యలను పలువురు ప్రస్తావించారు. తాను మాటలు మనిషిని కాదని, అన్నిటినీ చేతల్లో చేసి చూపిస్తానని సుజనా చెప్పారు. రోడ్లు డ్రైన్లు తాగునీటి సమస్యల పరిష్కారం దిశగా ఎన్నో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో రాజీ లేని పోరాటం చేస్తామని, ప్రజలందరూ భారీ మెజారిటీతో కూటమిని గెలిపించాలని కోరారు.ప్రజా సమస్యలు పరిష్కరిస్తా -కేశినేని శివనాథ్ విజయవాడలో ఎన్నో సమస్యలు దర్శనమిస్తున్నాయని వీటన్నింటినీ పరిష్కరించడంతోపాటు నగరాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని కేశినేని శివనాథ్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో భాగంగా కెరీర్ కౌన్సిలింగ్ సాఫ్ట్ స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువత అభిరుచి సామర్థ్యాలకు తగిన ఉపాధి మార్గాలను ఎంచుకోవడంలో తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఎంపీగా తనను ఎమ్మెల్యేగా సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ నిర్వహణ కమిటీ సభ్యులు రాంపిళ్ళ శ్రీనివాస్, కొణిజేటి రమేష్, గమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, ఉమ్మడి చంటి, పుప్పాల శ్రీనివాస్, పైలా సతీష్ గోగుశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.