వైసీపీ ‘మేనేజ్‘మెంట్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న అధికార పక్షం విజయవాడ పశ్చిమ సమీక్షా సమావేశంలో అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యలు అయోధ్య వ్యాఖ్యలపై ఎన్డీఏ ఆగ్రహంవైసీపీపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీజేపీ డిమాండ్ ఎన్నికల సంఘం ఎన్ని చెబుతున్నా… నిబంధనలు ఎన్ని వున్నా… వైసీపీ నేతలు మాత్రం వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను పార్టీ కార్యకర్తలుగా భావిస్తూనే చాప కింద నీరులా పని కానిచ్చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ లో జరిగిన వైసీపీ సమావేశంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం… విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో ఉన్నారు.
ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఆసిఫ్ బరిలో ఉన్నారు.. సుజనా దెబ్బను తట్టుకోలేక అయోధ్య రామిరెడ్డిని వైసీపీ రంగంలోకి దించింది.. ఇందులో భాగంగా పార్టీ నేతలతో అయోధ్య రామిరెడ్డి ఓ సమావేశాన్ని పెట్టారు… నియోజకవర్గానికి జగన్ ప్రచారానికి వస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గం ఓటర్ల డేటా మొత్తం మన దగ్గర ఉందని, ఎవరు టీడీపీ ఓటర్లో, ఎవరు వైసీపీ ఓటర్లో తెలుసని చెప్పుకొచ్చారు. సచివాలయ స్థాయిలో కొందరిని పెట్టుకున్నామని, అలాగే బూత్ లెవెల్లో కొందరిని పెట్టుకున్నామని … అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటూ దిశా నిర్దేశం చేశారు.
సచివాలయ లెవెల్లో అంటే సచివాలయ సిబ్బంది, వాలంటీర్లే అని అయోధ్య రామిరెడ్డి చెప్పకనే చెప్పారు. ఎవరు మన ఓటర్లో, ఎవరు టీడీపీ ఓటర్లో తెలుసుకోవడంతో ఓ స్పష్టత ఉంటుందని, దీనివల్ల విజయం సునాయాసమవుతుందని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఓటర్ల డేటా వైసీపీకి ఎలా వెళ్తుందని ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ ఓటర్లను బెదిరించేందుకే వైసీపీ ఎత్తుగడలు వేసినట్టుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం వైసీపీపై చర్య తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అయోధ్య రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియాకు బీజేపీ విడుదల చేసింది.