నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ అధికారంలోకి రాగానే ఆనేక పథకాలను రద్దుచేసి వారిని వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. ఆదివారం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్ లో దళిత గిరిజన బహుజనుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల మద్దతుతో గద్దెనెక్కిన సీఎం జగన్ అధికారం చేపట్టుగానే 27 పథకాలను రద్దుచేసి వారిని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసిపి పాలనలో సామాజిక న్యాయం మంట కలిసి పోయిందన్నారు.
దళితుల మీద దాడులు పెరిగిపోయాయని దీని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీలపైనే ఉందని అన్నారు. బ్రిటిష్ తరహా పాలన కొనసాగిస్తూ వైఎస్ జగన్ నియంతలా మారాడని దుయ్యబట్టారు. అసలు రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదని ప్రజల హక్కులను కాలరాస్తున్నాడన్నారు.
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు గణనీయంగా పెరిగాయని విశాఖపట్నంలో దళితుడైన డాక్టర్ సుధాకర్ మరణానికి వైసిపి అధినేతే కారణమన్నారు. సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును రాచ మర్యాదలతో ఊరేగిస్తున్నారు అన్నారు. వైసిపి దుర్మార్గాలపై కలిసికట్టుగా పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ లందరూ మద్దతిచ్చి ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల సీతారాం రెల్లి సంఘం అధ్యక్షులు భూపతి అప్పారావు మాల మహానాడు ఉపాధ్యక్షులు బండి బాలయోగి నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు కే.వి.రామారావు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డీ విల్సన్ బుడగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెనం నాగేశ్వరరావు రెల్లి సంఘం ఉపాధ్యక్షులు మాడుగుల నాగ శంకర్ టిడిపి అమరావతి జేఏసీ నాయకులు బాల కోటేశ్వరరావు అరుంధతి సంఘ అధ్యక్షులు గుండూరు నాగయ్య టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా జనసేన అధికార ప్రతినిధి కన్నా రజిని బిజెపి టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.