ఆర్యవైశ్యులకు అండగా ఉంటా -సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్యవైశ్యులందరికీ అండగా నిలబడతానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. భవానీపురం ఎస్ కన్వెన్షన్ హాల్ లో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
గాంధీజీ, పొట్టి శ్రీరాములు వంటి వారు చేసిన సేవలు వెలకట్టలేవని గుర్తు చేశారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఆర్యవైశ్యుల సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఏపీ ఆర్యవైశ్య సంఘం మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందని తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి కోరారు. ఏపీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే ఆర్యవైశ్యులకు లబ్ది చేకూరిందని ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా టీడీపీ హయాంలోనే ఏర్పాటు చేశారన్నారు.
నియోజకవర్గానికి, ఆర్యవైశ్యుల సంక్షేమానికి వెల్లంపల్లి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఆర్య వైశ్యుల సంక్షేమానికి కట్టుబడి ఉంటానంటోన్న సుజనా చౌదరికే తమ మద్దతు ఉంటుందని ఆర్యవైశ్యులంతా కూడా సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్య నాయకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సుజనాకు అందజేశారు అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ, ఆర్యవైశ్య ప్రతినిధులు వక్కలగడ్డ భాస్కరరావు, దర్శి వాసు, వక్కలగడ్డ శ్రీకాంత్, పైలా సురేష్, బొంతు మోహన్ రావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన అధికార ప్రతినిధి కన్నా రజని, ఆర్యవైశ్య సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.