ఎస్సీల వర్గీకరణకు ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నందున విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కు తమ మద్దతు ప్రకటిస్తున్నామని జాతీయ రెల్లి గ్రూప్ కులాల సంక్షేమం సంఘం అధ్యక్షుడు భూపతి అప్పారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మోదీ మద్దతు తెలపడం హర్షణీయమని, అందుకే బీజేపీ పశ్చిమ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి రెల్లి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.
భవానీ పురం బీజేపీ కార్యాలయంలో భూపతి అప్పారావు మీడియాతో మాట్లాడారు. విజయవాడ పశ్చిమంలో వేలాదిగా ఉన్న రెల్లి కులస్తులు సుజనా చౌదరికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు. రెల్లి యువతకు ఉద్యోగావకాశాలు లేవని, మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టులను రెల్లి యువతతో భర్తీ చేయాలని అప్పారావు డిమాండ్ చేశారు. ఈ పోస్టులను ఇతర కులాల వారితో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. సులభ్ కాంప్లెక్స్ ల నిర్వహణ రెల్లి యువతకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రెల్లి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాడుగుల నాగ శంకర్, నాయకులు మీసాల రాంబాబు, మల్లిఖార్జున్, తుపాకుల ఏడుకొండలు, కాశాల రామచంద్రరావు, విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.