ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ-టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ సితార కన్వెన్షన్ హాల్ లో జనసేన పార్లమెంట్ కోఆర్డినేటర్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విజయం కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి రావాలన్నారు.
పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని, తను కూడా పవన్ అభిమానిగా ఉన్నానన్నారు. జగన్ పాలనపై ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారని సుజనా ,చెప్పారు. వైసీపీ దుష్ట పాలనను వదిలించుకోవడానికి ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. నియోజవర్గంలోని అన్ని వర్గాల వారు తమకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని సుజనా హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఏపీ భవిష్యత్తు కోసమే కూటమిగా ఏర్పడ్డామని వివరించారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
జనసేన నేత అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ కూటమి విజయంతోనే ఏపీ అభివృద్ధి ఆధారపడి ఉందని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మోదీ హ్యాట్రిక్ విజయం ఖాయమని, ఏపీలో కూటమి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామన్నారు. సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పశ్చిమ నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని జనసేన శ్రేణులు ఆయన విజయానికి కృషి చేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, జాయింట్ సెక్రెటరీ గన్నుశంకర్, కృష్ణా పెన్నా మహిళా విభాగం కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్, జనసేన డివిజన్ అధ్యక్షుడు కూరాకుల సురేష్, బేవర శ్రీనివాస్ ,లింగం శివప్రసాద్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు