విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి-సుజనా చౌదరి తరఫున తనయుడు కార్తీక్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సోమవారం 47వ డివిజన్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే తన తండ్రి సుజనాతోనే సాధ్యమని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కార్తీక్ కోరారు. కొండ ప్రాంతాల ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించాలని, గత ప్రభుత్వం కరపత్రాల రూపంలో పట్టాలు ఇచ్చిందని, అవి నిరుపయోగంగా మారాయని కార్తీక్ తో కొందరు మహిళలు మొర పెట్టుకున్నారు. గండమాల అచ్చమ్మ వీధి, యలవ ర్తి వీధి, కాశీ పతి వీధి, కలరా ఆసుపత్రి వరకు కార్తీక్ ప్రచారం చేశారు. స్థానిక సమస్యలైన విద్యుత్ చార్జీల భారం, పెన్షన్ల తొలగింపు, జక్కంపూడి లోని టిడ్కో ఇళ్ల మంజూరు వంటి పరిష్కారాలు తన తండ్రి సుజనాతోనే సాధ్యమని కార్తీక్ అన్నారు. ఈ పర్యటనలో 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, పోతినీడి లోకేష్, కట్టా సాంబయ్య, కోటేశ్వర రావు, పైలా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



















విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తన సోదరుడు సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సోదరి ధనలక్ష్మి కోరారు. 39వ డివిజన్లో ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం చేశారు. తన సోదరుడిని గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గం రూపురేఖలను మారుస్తారని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తారని ధనలక్ష్మి వివరించారు.




